![]() |
![]() |
తెలుగు చిత్ర పరిశ్రమలో నేడు వందల కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడం సాధారణ విషయంగా మారింది. అయితే ఏడు దశాబ్దాల క్రితం, అంటే 1950ల కాలంలో ఒక సినిమా నిర్మించాలంటే సగటున 3 లక్షల రూపాయల బడ్జెట్ సరిపోయేది. అలాంటి రోజుల్లో ఏకంగా 35 లక్షల రూపాయల భారీ బడ్జెట్‌తో, ఊహకందని ప్రచారంతో రూపొంది బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఒక చిత్రం ఉందంటే నమ్మగలరా? ఆ చిత్రమే 1953 జూలై 10న విడుదలైన ‘ప్రపంచం’. తెలుగు సినీ చరిత్రలోనే తొలి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన, సంచలనాత్మక కథ ఉంది. ఈ సినిమా 1950లోనే అంటే 76 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.
ఈ చిత్ర నిర్మాత మునాస్ 1915 ఫిబ్రవరి 24న కొలంబోలోని ఒక ప్రముఖ వ్యాపార, రాజకీయ కుటుంబంలో జన్మించారు. 1933లో వ్యాపారంలోకి దిగి అపారమైన ధనాన్ని సంపాదించిన ఆయన, 1945లో ఇండో నేషనల్ బ్యాంక్‌ను కూడా స్థాపించారు. ఇంగ్లీష్, తమిళ సాహిత్యంపై మక్కువ ఉన్న మునాస్ 'సావిత్రి సత్యవాన్' అనే తమిళ చిత్రాన్ని ఏకంగా 79 సార్లు చూశారు. సినిమాపై ఉన్న విపరీతమైన పిచ్చి, ఆయన భార్య లలిత రాసిన కథపై ఉన్న నమ్మకం ఆయనను మద్రాస్ వైపు నడిపించాయి. సినీ ప్రముఖులు ఈ కథలో చాలా పాత్రలు, ఎన్నో సెట్స్ వెయ్యాల్సి ఉంటుందని, స్క్రిప్ట్ మార్చితే పాత్రలు తగ్గుతాయి, సెట్స్ కూడా తగ్గుతాయి. తద్వారా బడ్జెట్ కూడా చాలా తగ్గుతుందని చెప్పారు. కానీ, మునాస్ వినలేదు. తన భార్య అందించిన కథపై తనకు అపారమైన నమ్మకం ఉందని, కథను యధాతథంగా తియ్యాలని దర్శకుడికి సూచించారు. హెచ్.ఎం.రెడ్డి శిష్యుడు రామచంద్రన్ దర్శకత్వంలో తెలుగులో ‘ప్రపంచం’, తమిళంలో ‘ఉలగం’ పేరుతో ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రారంభించారు.
ఈ సినిమా ప్రయాణం ఎన్నో విచిత్రాలకు వేదికైంది. 1950 ఏప్రిల్‌లో స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం కాగా, తెలుగు వెర్షన్‌కు మహాకవి శ్రీశ్రీ మాటలు, 15 పాటలు రాశారు. ఆరుద్ర ఒక పాట రాశారు. చిత్రంలో ఏకంగా 160 మందికి పైగా నటీనటులు నటించారు. కాంచన, రామశర్మ, జి.వరలక్ష్మి, వల్లం నరసింహారావు, షావుకారు జానకి, లక్ష్మీకాంతం వంటి ప్రముఖులతో పాటు నాగయ్య కేవలం రెండు రోజుల గెస్ట్ రోల్ కోసం పాతికవేల రూపాయల భారీ పారితోషికం అందుకున్నారు. సీన్ నచ్చకపోతే మళ్లీ మళ్లీ రీషూట్ చేయడం, రోజూ షూటింగ్ యూనిట్ అందరికీ ల్యావిష్ భోజనాలు, ఆపిల్స్ అందించడంతో నిర్మాణ కాలం ఏకంగా 3 సంవత్సరాలకు చేరుకుంది. 16,700 అడుగుల నిడివి ఉన్న ఈ సినిమా కోసం అక్షరాలా 1,00,000 అడుగుల నెగిటివ్ ఫిలిం ఖర్చు చేయడం ఆ రోజుల్లో ఓ సంచలనం.
పబ్లిసిటీ విషయంలోనూ మునాస్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒక తెలుగు సినిమా ప్రచారం కోసం హాలీవుడ్‌కు చెందిన 'కిమ్మర్' కంపెనీని నియమించారు. ఆకాశం నుండి హెలికాప్టర్ ద్వారా ఆంధ్రదేశమంతటా కరపత్రాలు వెదజల్లి, తొలిసారిగా 101 థియేటర్లలో భారీగా విడుదల చేశారు. అయితే, ఐదు తరాల కథగా సాగే ఈ చిత్రంలో ఏ పాత్ర ఎందుకు వస్తుందో, సన్నివేశాల మధ్య సంబంధం ఏంటో తెలియక ప్రేక్షకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దాంతో మొదటి రోజు థియేటర్ల నుంచి జనం పారిపోయారు. ఇక రెండోరోజు థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలా రూ.35 లక్షలు నీళ్లలా ఖర్చు పెట్టి తీసిన ‘ప్రపంచం’ తెలుగులో తొలి బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
![]() |
![]() |